27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఈ తోటలో
పువ్వులతో పాటు
నవ్వులు పూయించాలని నా చిరకాల సంకల్పం
ఈ నేలపైన 
చీకటిని తరిమేసి
నిరంతరం వెన్నెల కాయించాలని నా ఆశయం
ఈ గాలిని
ప్రక్షాళనం చేసి
పరిమళాలతో అభిషేకించాలని నా ఆ కాంక్ష
తోట నవ్వింది
జీవితాన్ని కాదని
అల్లుకున్న తీగలకు అడ్డదిడ్డంగా పడి లేస్తూ
పరుగెడుతున్న మనిషి ఉన్మాదం చూడమంది
నేల నవ్వింది
కాంతి కిరణాలను తగుల బెట్టి
కారు చీకటిలో కాపురముంటున్న
అర్భకుల్ని చూపించింది
గాలి పగల బడి నవ్వింది
ప్రతి మనిషి హృదయం కాలుష్య మయం
ఏ సౌరభం చొరబడని కీకారణ్యం
ఎలా ప్రక్షాళన చేస్తావంది
అందుకే నేను తిరిగి వచ్చేసాను
నా హృదయ ప్రాంగణం లో
పాట ఒకటి సృష్టించుకొని
ఆ కుటీరంలో నివసిస్తున్నాను
పరిమళాలు చల్లుకొంటు
వెన్నెల జల్లుల్లో తడుస్తూ
ప్రతి రోజు ప్రభాతాల్ని వీక్షిస్తున్నాను
మలయపవనాల వెంట
మధుమాసం జంటగా
మైళ్ళ కొలదీ విహారం చేస్తున్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి