27, అక్టోబర్ 2017, శుక్రవారం

నిన్న 
కొన్ని చినుకులు కనిపించాయి 
నింగి నుండి వయ్యారంగా దిగి వచ్చి 
కూనిరాగం వినిపించాయి 
నాలో నిద్రాణమై ఉన్న అక్షరాలు 
తల ఎత్తి కారుమబ్బులకు జోహారులన్నాయి 

ఒక మొక్క శిరసెత్తుతున్న కైవడి 
ఒక కవిత మొలకెత్తుతున్న సవ్వడి 

ఎండమావులు 
గాండ్రించిన అవని పైకి 
ఆమని గజగామినిలా అడుగిడుతున్నది 

ఎడారిగా మారిన ఎదలోనికి 
ఒక పూలరుతువు నడచి వస్తున్నది 
నా మనసే ఒక కుసుమమై 
విరబూయాలని ఆయత్తమౌతున్నది 

నిద్ర మత్తు వదిలించుకొని 
కళ్ళు నులుముకొని 
ఒళ్ళు విరుచుకున్నది నా కలం 
ఇక నల్లేరు మీద బండి నడకలా 
సాగుతుంది నా పయనం //
 — 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి