27, అక్టోబర్ 2017, శుక్రవారం

అడుగో మల్లెమాల
మనందరి మనో మందిరాల
సుగంధాలు వెదజల్లుతున్న
సుందర సుకుమార భావాల సుమ మాల
అతడు ఆటవెలదులతో ఆటలాడు వేళ
అందరి హృదయాలలో ఆనంద హేల
ఎక్కడివి ఈ అనర్ఘళ పద్యాలు
ఎక్కడివి ఈ అందాల జలపాతాలు
శ్రోతల హృదయాల్ని ఉర్రూతలూగిస్తూ
ఎక్కడివి ఈ పద మంజీర నిక్వణాలు
ఈ చిత్ర విచిత్ర పద విన్యాసాలు
కాదు కదా ఈతడు వేమన కజ్ఞాత శిష్యుడు
కాదు కదా భర్తృహరి కనుంగు చెలికాడు
సుమతి శతక కారునికి అసలైన సరి జోడు
ఔను సుమా ఇతడు సినీ సౌందర్య నందనంలో
మల్లెల మాలలల్లుతున్న సుందర రాముడు
నడిస్తే పద్యం
నవ్వితే పద్యం
ఊపిరి విడిస్తే పద్యం
ఏమిటి ఈతని నేపధ్యం
ఈ యన బాల్యం సస్య శ్యామలం
ఈయన జీవనం పచ్చ తోరణం
ఈయన హృదయం శబ్దాలయం
ఈతని మది కౌముది కళా నిలయం
ఈయన నాలుక పైన
సదా సూక్తి ముక్తావళీ పద నర్తనం
నిలువెల్లా సంగిత సాహిత్య సంకీర్తనం
ఔనౌను ఈతడు
సినీ వినీలాకాశంలో
రెప రెపలాడుతున్న విజయ కేతనం
తెలిసింది తెలిసింది మల్లెమాల గారూ
మీ ఆటవెలది నెల్లూరు నెరజాణ
మీ మది రసరమ్య గీతాలు పలుకుతున్న మాణిక్య వీణ
మీరొక నడుస్తున్న మానవతా గీతం
మీరున్న చోట సరస సాహిత్య సంగీత హిమ పాతం
ఆమని వలె
నవ వసంత యామిని వలె
కదలాడే మీ కవితా ధార నేమన వలె
ఏమన వలె ...ఏమన వలె
వేమన వలె
రాముని వలె
ఆ ముని వలె
నడయాడే
మిమ్మేనవలె
వేమన
వేమన
అభినవ వేమన
అహో అభినవ వేమనా
అందుకొనుమా మా అభివందనం
*********************************
8-1-2003 న ఎం ఎస్ రెడ్డి గారికి , కట్ట మంచి కళా వేదిక ప్రాంగణం లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం '' అభినవ వేమన'' బిరుదు ప్రసాదించిన సమయాన నేను వ్రాసినది, వేదిక పైన ఆలపించినది అయన అభినందనలు చూరగొన్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి