27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఓ.. మనిషీ !
------------
చిరు నవ్వు ఎదుట
ఒక క్షణం నిలబడు
నీలోకి చిరాయువు పరుగెత్తు కొస్తుంది
వలచిన చెలి ముందు
సాష్టాంగ పడు
వేయి వసంతాల విభవం
వెల్లువెత్తు తుంది
నిన్ను రక్కిన వాణ్ణి
చూచి జాలి పడు
నిశ్చింతగా నీ యాత్ర కొనసాగుతుంది
క మ్ముకొ స్తున్న
చీకటిని స్వాగతించు
అది ఉదయమై వెలుగు కుమ్మరిస్తుంది
కారుమబ్బుల కదలికల్ని
ఆనందంగా వీక్షించు
కాసేపటికి అది ఏరులై వరదలై పారుతుంది
తనని తాను మరచి
మరణం వైపు వేగంగా
పరుగు తీస్తున్న
మనిషిని చూచి విచారించు
చితి మంటలలో వాడికి తప్పక
తన జీవన తత్త్వం తెలిసి వస్తుంది
ఆవురుమంటూ
పోగు చేసికొంటున్న
వాడి అమాయకత్వం
చూచి చిరునవ్వు నవ్వుకో
బావురుమంటూ వాడు
రోదించే క్షణాలు త్వరలోనే కదిలి వస్తాయి
దోచుకున్నది దాచుకోలేక
వాడు పడుతున్న తపన చూడు
కచ్చితంగా కారాగారం నుంచి
వాడికి త్వరలో పిలుపోస్తుంది
పదవి కోసం పాకులాడే పాట్లు చూడు
ప్రజల్ని ఓట్లుగా తూచే నోట్లు చూడు
ఒక్క పెట్టున జనం వాణ్ని
బంగాళాఖాతం లోకి విసిరేసే రోజు వస్తుంది
ఖనిజ సంపద కొల్లగొట్టి
మూటకట్టు కొంటున్న వాడి అహంకారం చూడు
ఆగ్రహించిన జనం వాడి జాతకం మార్చే రోజు వస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి