27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎందుకు నేల తల్లీ 
అమాంతం పెరిగి పోయావు పెట్రేగి పోయావు 
విలువ పెంచుకొని అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపావు 
ఇంతకాలం వాళ్ళు నీ ఉనికి ఎక్కడో తెలియని నిరామయంలో 
ఇప్పుడు నీవేమో నింగిని తాకే సంబరం లో సంరంభం లో 

ఆ అన్నదమ్ము లిద్దరూ క్రుద్ధులై 
అరడుగు నేల దగ్గర అగ్ని రాజేసుకున్నారు 
ఒకరు స్థలం ఇంకొకరు ఆక్రమించారని 
ఆవేశంలో ఆక్రోశంలో ఉన్నారు 
ఎగదోసే ‘’నలుగురి’’ మాటలు విని 
పులి బోనులో వచ్చి పడ్డారు 

ఆహారం కోసం పులి అడివంతా గాలిస్తుందట 
కాని ఆహారమే అతని దరికి వెతుక్కొంటూ వస్తుందట 
అతడే న్యాయవాది -- అది అతడికి పట్టిన అదృష్టం

అరడుగుల వ్యాజ్యానికి అర ఎకరం సంతర్పణ 
ఆరు సంవత్సరాలు సుదీర్ఘ సంఘర్షణ 
వాళ్ళు గెలిచి ఓడారో ఓడి గెలిచారో 
వాళ్ళకే కాదు వూరి వారికి అర్ధం కాలేదు 
మొత్తానికి ఆ ‘నలుగురు ‘ సరదా కొద్ది 
ఆ ఇద్దరి మధ్య రేపిన చిచ్చు వ్యర్ధం కాలేదు 

అన్నదమ్ము లిద్దరూ రెంటికి చెడిన రేవడు లయ్యారు 
బహుకాల ద్వంద యుద్ధంలో గాయాలతో అలసి పోయారు 
ఉన్న భూమిని అమ్ముకొని కూలీలుగా వలస పోయారు 

ఏది ఇలలోన అసలైన న్యాయం 
ఏమై పోయినది నాలుగు పాదాల నడిచిన ధర్మం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి