27, అక్టోబర్ 2017, శుక్రవారం

మృగాళ్ళు
------------
1
జగతి నడచి పోతున్నది కొన్ని యుగాలుగా
నడుస్తున్నాము నువ్వు నేను చెరిసగాలుగా 
మన సంస్కృతీ సాంప్రదాయాలు ఏమయ్యాయో
నేడు మనుషులు మారిపోతున్నారు మృగాలుగా
2
ఏ నీతి న్యాయం ధర్మం బోధించని చదువులు
సభ్యతా సంస్కారం నేర్పించని గురువులు
మనసులు మలినమై మనుషులు మాయమై
మన చుట్టూ సంచరిస్తున్న చీడపురుగులు
3
విశృంఖల శృంగారం చూపిస్తున్నవి
చలన చిత్రాలు
అంతర్జాలంలో స్వైర విహారం
చేస్తున్నవి కామసూత్రాలు
నిమ్మకు నీరెత్తినట్టు
కిమ్మనకుండా కామాంధులకు
కఠిన శిక్ష పడకుండా
కాపాడుతున్నవి ప్రభుత్వాలు
4
ఎవరు చెప్పాలి వీళ్ళకి
మహోన్నతమైన మానవత గురించి
ఎలా తయారు చేశాడు వీళ్ళని
ఇంత క్రూరమృగాలుగా విరించి
ఇన్ని అకృత్యాలు వింటూ
అనునిత్యం ఎదుర్కొంటూ
ఎంతకాలం మనగలం కాపాడుకోగలం
వీళ్ళ బారి నుంచి
5
అసలు ఎవరు వీడిని ఇలా తయారు చేసింది
వీడిలో ఇంత కర్కశత్వాన్ని నూరిపోసింది
రాక్షసుడిగా కీచకుడిగా మారి పొమ్మని
ఏ విధి వీడి నుదుట ఈ రాత రాసింది
6
ఏ తల్లి తండ్రి గురువు చెప్పడం లేదు
ఏ చదువు వాడిని సంస్కరించడం లేదు
రాక్షసుడిగా చెలరేగుతున్న వాడిని
మనిషి అనడానికి మనస్కరించడం లేదు
7
అమ్మలగన్న అమ్మలు
మీరు సృష్టికి మూలపుటమ్మలు
ఎందుకు అనుకుంటున్నారు
మీరు చాతకాని అబలలు
మృగాలు చెలరేగిన వేళ
రోషకషాయిత నేత్రలై పీక నొక్కండి
‘అమ్మా’ అంటూ మిమ్మల్నే కలవరిస్తూ
అరచి చస్తారు వెధవలు
8
వాడు సభ్య సమాజానికి పట్టిన మహమ్మారి
వాడిని అంతమొందించడానికి లేదు మరో దారి
ఆ కిరాతక సంఘటన జరిగిన మరుక్షణమే
అక్కడి కక్కడే ఉరి శిక్ష విధించడం తప్పని సరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి