27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఓ ఉగాదీ నీకు స్వాగతం 

ఎక్కడా 
పచ్చని చెట్లు కనిపించడం లేదు 
పచ్చ నోట్ల స్వైర విహారం తప్ప 
పచ్చని పొలాలు కనిపించడం లేదు
పచ్చిక మొలవని బీళ్ళు తప్ప
పచ్చని జీవితాలు కనిపించడం లేదు
పరుగులు తీసే యంత్రాలు తప్ప

పచ్చని అందాలు కనిపించడం లేదు
ప్రేమానుబంధాలు కనిపించడం లేదు
మమతానురాగాలు వినిపించడం లేదు

ఏరువాకలు లేవు ఎండమావులు తప్ప
వాన చినుకులు లేవు వడగాడ్పులు తప్ప

ఇక పచ్చని చిలకలకు పాడే కోయిలలకు
పరుగులు తీసే సెలయేళ్లకు ఆవాస మేది
పూలకు పరిమళాలకు పరవశాలకు
ఉగాదులకు ఉషస్సులకు అవకాశమేది

పచ్చదనం కనుమరుగైన జీవితాలలోకి
ఉగాదు లెలా వస్తాయి
పైరు పచ్చలు కానరాని పుడమి పైన
పైర గాలులు ఎలా వీస్తాయి

అయినా ఓ ఉగాదీ నీకు స్వాగతం
కొత్త చిగురులు తొడిగిన నా జీవన వనిలోకి
ఓ హేవళంబీ నీకు సాదర ఆహ్వానం
నవ వికసిత కుసుమ విలాసం నర్తించే
నా హృదయ ప్రాంగణం లోకి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి