27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆకు నాకు ఆదర్శం 

చినుకు పడిన వేళ
చిగురులు తొడిగిన 
చిగురాకు నాకు ఆదర్శం 

నిశ్చింతగా నిర్మలంగా 
చిరుగాలి వొడిలో సయ్యాట లాడే 
ఆకు నాకు ఆదర్శం 

వెచ్చని వేసవి తలదాల్చి 
చల్లని నీడ నిచ్చి సేద దీర్చి 
రాలిపోయే ఆకు నాకు ఆదర్శం 

చిన్నారి పూలకు ఊ పిరు లూ ది 
పురుడు పోసే ఆకు నాకు ఆదర్శం 

రంగు రంగుల రంగేళి ,
గాలి తరగల తేలి 
రెపరెప లాడే ఆకు నాకు ఆదర్శం 

పాడు గాలి తాను తాగి 
ప్రాణ వాయువు పుక్కిలించి 
జగతి ప్రగతికి ఊతమిచ్చే 
ఆకు నాకు ఆదర్శం 

చింత లన్ని దీరి రంగు మారి 
విసిగి వేసారి నిశ్చింతగా 
తన తనువు చాలించి 
మరో చిగురాకుకు చోటిచ్చి 
చాటిన అసమాన త్యాగం 
అదే కదా కర్మ యోగం

ఆ ఆకు నాకు ఆదర్శం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి