27, అక్టోబర్ 2017, శుక్రవారం

పాట ఆవిర్భావం --
-------------------

ఎన్ని క్షణాలు గిలగిల కొట్టుకుంటాయో 
ఎన్ని చుక్కల రక్తం ఆవిరై పోతుందో
పాట రాయడ మంటే మాట కాదు
మీకేం తెలుసు ఎన్ని నరాలు తెగుతాయో 

మనసులో ఎన్ని పాత్రల్ని ధరించాలి 
పాట కోసం ఎన్ని పదాల్ని అర్ధించాలి 
రాగమై రసయోగమై ప్రభవించే దాకా 
ఆ ప్రసవ యాతన తాను భరించాలి 

ఒక అక్షరం అలవోకగా దొరుకుతుంది
కలం దానిని కసిగా కొరుకుతుంది
ఏ ఫలదీకరణం అక్కడ జరుగుతుందో 
ఆశ్చర్యంగా అది ఒక పాటగా పండుతుంది 

ప్రతి పాట ఒక పాఠ్య గ్రంధమే
ప్రతి మాట సుమసుగంధమే 
ఎన్ని రాగాలు పల్లవిస్తాయో 
ప్రతి పాట ఒక పాలసంద్రమే 

పాట అంటే ఆనందం ఆహ్లాదం 
పాట వింటే ఉల్లాసం ఉత్సాహం
పాటల పల్లకిలో ఊరేగుతుంటే 
అనునిత్యం ఆనంద సందోహం 

అందమైన పదాల సముదాయం
పల్లవి అనుపల్లవిల సహాయం
రెండు మూడు చరణాలు చాలు 
రవళిస్తుంది రాగ రసోదయం 

పాట ఎగురుతోంది హాయిగా పక్షిలా 
స్వేచ్చస్వాతంత్ర్యాలకు ప్రత్యక్ష సాక్షిలా
మనిషి కోసం ఎన్ని గీతాలు ఆవిర్భవించాయో 
అతడిని కాపాడుతున్నాయి శ్రీరామరక్షలా
No automatic alt text available.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి