20, మార్చి 2012, మంగళవారం

ఉగాది గీతం

జాతి సంపద ఎంత వృధా అయ్యేనో కదా
భావి మేధస్సెంత నిస్సారమయ్యేనో కదా
వందేళ్ళ సెంచరీల క్రికెటాట వలన
జనమంత సోమరులై వీక్షించుట వలన

ఎన్ని మమతాను రాగాలు మసి అయ్యేనో కదా
ఎన్ని రాగ బంధాలు కనుమరుగయ్యేనో కదా
ఏలిన నాటి శనివోలె నట్టింట కొలువైన
బుల్లి తెర చిత్ర విచిత్ర హింసల విన్యాసాల వలన

ఎంత జీవన రాగం నేల పాలయ్యేనో కదా
ఎంత వెన్నెల కాంతి అంతర్ధాన మయ్యేనో కదా
సుఖ సంతోషాలు మరిచి ఆలు బిడ్డల మరిచి
ఎల్ల వారిని మరిచి వెర్రిగాఈ మనిషి
ఎండమావుల లోన సంచరించుట వలన

ఎన్ని ఇడుముల పాలయ్యేనో కదా
ఎన్ని కడగండ్లు తోడయ్యేనో కదా
ఎదురై న మనిషిని కరకర నమిలేసి
ఎనలేని ఆశతో లంచాలు భోంచేసి - కడకు
ఉన్న ఉద్యోగ మొకటి ఊడీ పోవుట వలన
కారాగారమందు చేరి పోవుట వలన

ఎంత ఓజస్సు ఆవిరై పోయెనో కదా
ఎంత తేజస్సు మాటు మాయమయ్యేనో కదా
మాయదారి సారా తాగి రేయింబవళ్ళు
గమ్మత్తుగా మత్తులోన మునిగి తేలుట వలన
ముంగిటిలో మృత్యు నర్తనమ్ము వలన

ఎంత మానవత ధ్వంస మయ్యేనో కదా
ఎంత నాగరికత దగ్ధ మయ్యేనో కదా
నరునిలోని నరుడు కనుమరుగౌట వలన
అంతులేని ఆశ అంతరంగాన చెలరేగి
ప్రేమానురాగాలు అంతరించి పోవుట వలన

ఎన్ని యుద్ధాలు ఎన్ని అబద్ధాలు
ఎన్ని అసత్యాలు ఎన్ని అవినీతి కృత్యాలు
ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని రాద్ధాంతాలు
ఎన్ని భయాలు ఎన్ని సందియాలు
ఎన్ని దిగుళ్ళు ఎన్ని నెగళ్లు

ఏ గౌతముడు తిరిగి వస్తాడు
మానవతా మందిరాలు ఈ నేలపైన నెలకొల్పగా
ఏ గాంధీ మరలా జన్మిస్తాడు
అహింసా శాంతి సందేశాలు జాతికి వినిపించగా

ఏ ఉగాది అయినా ............
వసంతాన్ని కొని తెస్తుందా, కోయిల పాటలు వినిపిస్తుందా
ఏ కాలానికైనా ఈ అంధకార యుగం అంతరిస్తుందా
ఏనాటికైనా సరి కొత్త యుగం ఇలపైన అవతరిస్తుందా
ఏ నవ యువ గీతమైనా జాతి జాతకం మారుస్తుందా
ఏ చైతన్యా రావమైనా జాగృతి జయ కేతనం ఎగుర వేస్తుందా

4 వ్యాఖ్యలు:

 1. "ఎన్ని మమతాను రాగాలు మసి అయ్యేనో కదా
  ఎన్ని రాగ బంధాలు కనుమరుగయ్యేనో కదా
  ఏలిన నాటి శనివోలె నట్టింట కొలువైన
  బుల్లి తెర చిత్ర విచిత్ర హింసల విన్యాసాల వలన"

  టివిని ఏలిన నాటి శనితో పోల్చడం...చాలా బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రతి మనిషి తనలోని అన్నిరకాల అవలక్షణాలను మార్చుకుంటే సమాజం మారుతుంది.కవి ఆవేదన లో
  సమాజ పరిస్థితి ప్రతిబింబిస్తుంది.మార్పు వ్యక్తినుండి మొదలవ్వాలి.ఎవరికి వారు తమ అలవాట్లు మార్చుకోవాలి. మంచి కవిత.

  ప్రత్యుత్తరంతొలగించు