28, మార్చి 2012, బుధవారం

మెరుపు తీగ

మెరుపు తీగ నేల పైకి దిగి వచ్చిందా
కొండ వాగు అడవి దాటి నడిచొ చ్చిందా
అంతలోనె మందారం అర విచ్చిందా
అవనిలోని సింగారం శిర సొంచిందా//

తనువంతా సిరి వెన్నెల అలదు కొన్నది
నిలువెల్లా సిందూరం చల్లుకొన్నది
కలువలనే కన్నులుగా చేసుకొన్నది
చీకటినే కాటుకగా దిద్డుకొన్నది //

రతనాలనుముత్యాలను రాసి పోసిరో
తేనియతో తీవలతో మూస చేసిరో
ఇన్నాళ్లుగ పరువాలను ఎచట దాచిరో
ఈ బొమ్మను ఇంతకాల మేమి చేసిరో //

కొండ గాలి తిరిగింది ఆమె రాకతో
చంద్రవంక జరిగింది ప్రేమ లేఖతో
నీలి నింగి వంగింది కాంతి రేఖతో
పడుచుదనం నవ్వింది ఏరువాకతో //

1 వ్యాఖ్య:

  1. చాలా బాగుంది. బాగా రాసారు.
    మీ కవితలన్ని చదువుతున్నాను. మీరు చాలా బాగా రాస్తారు.

    ప్రత్యుత్తరంతొలగించు