28, మార్చి 2012, బుధవారం

ఎలకోయిల గానం

వేల వేల గానాలు
వెదురు పొదలలో ఉన్నాయి
కోటి కోటి రాగాలు
కొమ్మ గూటిలో ఉన్నాయి
ఎవరికైనా తెలుసా
ఎలకోయిల గీతాలన్నీ
నా ఎద లోగిలిలో ఉన్నాయి //

నాకంటి పాపలోన
మురళీరవముంది
నా పెదవి అంచులోన
వేణు గానముంది
నానడుము వొంపులోన
వీణ దాగి ఉంది
ఎంచి ఎంచి చూసావా
నిలువెల్లా పిల్లనగ్రోవిగ మారింది //

ముద్దు ముద్దుగా నవ్వానా
అది మోహనరాగం
మోవి మోవి కలిపానా
అది జీవనరాగం
తీగ లాగ అల్లుకుంటే
అది కుసుమ పరాగం
అందమైన జీవిత మంటే
అది సరిగమ పదనిసరాగం //

1 కామెంట్‌:

  1. బాగుంది.. పదం పదం కలిస్తే పాట అవుతుంది.. స్వరం స్వరం కలిస్తే రాగం అవుతుంది

    రిప్లయితొలగించండి